- Back to Home »
- Film News »
- Yvs Chowdary Interview On Nippu
Posted by : My viewS
Friday, January 6, 2012
భారీ చిత్రాల దర్శకుడు వై.వి.యస్.చౌదరి తొలిసారిగా మరో దర్శకుడి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'నిప్పు'. తన మిత్రుడు గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ, దీక్షా సేథ్ జంటగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆడియోని సంక్రాంతికి, సినిమాని ఫిబ్రవరిలోనూ విడుదల చేస్తున్నామని నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో 'నిప్పు' చిత్రం గురించి జరిపిన ఇంటర్వ్యూ .....
నిప్పు చిత్రం కథాంశం ఏమిటి?
ఇది హైలీ యాక్షన్ ఎంటర్ టైనర్. మా బ్యానర్ లో వస్తోన్న ఐదవ చిత్రమిది. 'నిప్పు' అనేది రవితేజ క్యారక్టరైజేషన్ ని తెలియజేస్తుంది . కథ విషయానికొస్తే ... హీరో ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు ... అయితే ఓసారి ఒక బాధ్యత కూడా వస్తుంది. అదేమిటనేది ఆసక్తికరంగా సాగుతుంది. రవితేజ ఎనర్జీ తో బాటు, గుణశేఖర్ గారి పక్కా
ప్లానింగ్ తో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ .
మీరే పెద్ద దర్శకుడు... అలాంటిది మరో దర్శకుడితో సినిమా నిర్మించడానికి కారణం?
నిజం చెప్పాలంటే నేను గుడివాడ లో చదువుకుంటున్నప్పుడే ప్రతి ఒక్క దర్శకుడి సినిమా చూసేవాడిని. ముఖ్యంగా బాపు, విశ్వనాథ్, కె. రాఘవేంద్ర రావు గారి సినిమాలను చూసి బాగా ఇన్స్ పైర్ అయ్యాను. ఈ క్రమంలో నేను దర్శకుడ్ని అయ్యాక, తర్వాత నిర్మాత గా కూడా మారాక నాకు కంఫర్టబుల్ అయిన దర్శకులతో సినిమాలు నిర్మించాలని అనుకున్నాను. అందులో భాగమే ఈ మొదటి ప్రయత్నం. ఎందుకంటే, ఒక్కొక్క దర్శకుడిది ఒక్కో రకమైన శైలి. గొప్ప దర్శకులతో పాలు పంచుకోవాలన్నది నా కోరిక. అందుకే, ఒక పక్క దర్శకత్వం వహిస్తూనే, మరోపక్క సినిమాలు నిర్మించడానికి పూనుకున్నాను.
రవితేజ, గుణశేఖర్ లతో పనిచేయడం ఎటువంటి అనుభవాన్నిచ్చింది?
వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో నాకు స్నేహితులు. దర్శకుడ్ని కావాలని 1983 లో నేను చెన్నై వెళ్లాను. ప్రముఖ డ్యాన్సర్ అనూరాధ గారింట్లో రవితేజ, నేను ఎనిమిదిన్నర సంవత్సరాలు కలిసి ఒకే రూం లో ఉన్నాము. గుణశేఖర్ మా రూం కింద ఉండేవాడు. అలా మా స్నేహం అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. అంతకు ముందు కొన్ని రూముల్లో స్నేహితులతో కలిసి ఉన్న నందమూరి తారక రామారావుగారు, మెగాస్టార్ చిరంజీవి గారు వంటి ప్రముఖులు పెద్ద స్టార్లు అయ్యారు. అలాగే మేము కూడా అవుతామని ఊహించుకునే వాడ్ని. తర్వాత రవితేజ, గుణశేఖర్, నేను మంచి పొజిషన్లో నిలబడ్డాము. ఈరోజు నా స్నేహితులతో కలిసి నేను ఈ 'నిప్పు' నిర్మిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది.
మరి గుణశేఖర్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేయిస్తాడని వినికిడి?
అది కేవలం రూమర్ మాత్రమే. ఎందుకంటే, ఆయన రూపొందించిన 'చూడాలని ఉంది' లో కలకత్తా సెటప్, 'ఒక్కడు'లో చార్మినార్ సెట్ , అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి దేవాలయం సెట్... ఇవన్నీ ఆయా చిత్ర కథలు డిమాండ్ చేయబట్టే వేయడం జరిగింది. అసలు ఆ ఒరిజినల్ ప్లేస్ లలో షూటింగ్ చేయాలంటే కష్టం. ఇక మిగతా సినిమాల్లో అంత గా ఉండవు. ఇక నేను నిర్మించే ఈ 'నిప్పు' సినిమా కథ కి సెట్స్ డిమాండ్ చేయవు కనుక, పెద్దగా సెట్స్ లేవు. కాని ఖర్చు మాత్రం బాగానే పెట్టాను (నవ్వుతూ). నేను కేవలం ఆరేడు సార్లు మాత్రమే సెట్స్ కి వెళ్ళుంటాను. మిగతా టైములో 'రేయ్' షూటింగ్ లో నిమగ్నమయ్యాను. అంటే అర్ధం చేసుకోండి. వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్. మొన్ననే సినిమా చూసాను. చాలా అద్భుతంగా తీసాడు. అయాం వెరీ హ్యాపీ ఫర్ ద అవుట్ పుట్.
నిప్పు చిత్రాన్ని ఎక్కడెక్కడ ఎన్ని రోజుల్లో చిత్రీకరించారు?
130 రోజుల్లో హైదరాబాద్, టర్కీ, పొల్లాచ్చిలలో చిత్రీకరించడం జరిగింది.
డిజిటల్ పోస్టర్ అంటూ విడుదల చేసారు. దాని గురించి చెప్పండి?
పబ్లిసిటీలో ఇది కొత్త పుంత. దక్షిణ భారతదేశంలోనే మొదటి సారిగా దీనిని విడుదల చేసాము. దీనిని కేవలం డిజిటల్ స్క్రీన్స్ మీద మాత్రమే చూడగలము. ఇది కదులుతూ సౌండ్ కూడా ఇస్తుంది.
సినిమాలో నటించిన ఇతర నటీనటుల గురించి?
పొడుగుకాళ్ల సుందరి దీక్షాసేత్ తన అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శించగా, డా.రాజేంద్రప్రసాద్ గారు గౌరవప్రదమైన పాత్ర పోషించారు. ఇంకా బ్రంహానందం, తమిళ హీరో శ్రీకాంత్ , తదితరులు నటించారు.
నిప్పు లో హైలైట్స్ ఏమని భావిస్తున్నారు ?
ముఖ్యంగా రవితేజ ఎనర్జీ , గుణశేఖర్ టేకింగ్ , బ్రహ్మానందం కామెడి , ఇంటర్వెల్ బ్యాంగ్ , సాయి తమన్ సంగీతం , కణాల్ కన్నన్ పోరాటాలు అన్నీ హైలైట్ గా నిలుస్తాయి.
సినిమాని ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
సంక్రాంతికి ఆడియోని, ఫిబ్రవరి 2 న సినిమాని విడుదల చేయనున్నాము . జనవరి 26 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహిస్తాము. ఎందుకంటే, ఆడియో మీద అంత నమ్మకం వుంది. అందుకే ముందే డేట్ చెప్పేస్తున్నాను.
మీ 'రేయ్' చిత్రం ఎంతవరకు వచ్చింది ?
మొన్ననే బ్యాంకాక్ లో షూటింగ్ చేసి వచ్చాను. త్వరలో హైదరాబాద్ లో షెడ్యూల్ ప్రారంభిస్తాను. అందులో మొదట అనుకున్న శుభ్రఅయ్యప్ప హీరోయిన్ కాదు. కొన్ని కారణాల వలన ఆమెని తప్పించి, శ్రద్దా దాస్ ని ఎంచుకున్నాం.